- కత్తి మాకిస్తే హైడ్రా బుల్డోజర్‌కు అడ్డంగా వెళ్లి ఆపుతం: కేటీఆర్
- జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలి
- యూసుఫ్‌గూడ ఎన్నికల ర్యాలీలో కేటీఆర్ కామెంట్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ‘కత్తి వాళ్లకు ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయాలంటే ఎట్ల? కత్తి మాకు ఇస్తే హైడ్రా బుల్డోజర్‌కు అడ్డంగా వెళ్లి ఆపుతాం’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం, ఆదివారం వచ్చిందంటే ఈ సర్కారు పేదల ఇండ్లపైకి బుల్డోజర్ వస్తోందని మండిపడ్డారు. గడిచిన రెండేండ్లలో వేల ఇండ్లను నేల మట్టం చేశారన్నారు.
ఇందిరమ్మ రాజ్యం పేరుతో ఇండ్లు కూలగొట్టే వాళ్లకు ఎవరైనా ఓటేస్తారా? అంటూ ప్రశ్నించారు. బుల్డోజర్‌ను ఆపాలంటే కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో జరిగిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అందరినీ మోసం చేసిందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని, అప్పుడే సీఎంగా రేవంత్ రెడ్డి ఇంకా మూడేండ్లు ఉంటడో, మూడు నెలలు ఉంటడో తేలిపోతుందన్నారు.
ఢిల్లీలో రేవంత్‌పై కత్తులు నూరుతున్నారని, కొందరు నేతలు సీఎం కుర్చీ కోసం రెడీ అవుతున్నారని విమర్శించారు. ‘‘నేను యూసుఫ్‌గూడలో ఉన్న అప్పటి అమరావతి పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నా. నాకు ఈ నియోజకవర్గం గురించి పూర్తి అవగాహన ఉంది. ప్రజలు ఓటు వేసే ముందు గుండె మీద చేయి వేసుకొని ఆలోచించి ఓటేయాలి. ఆడ బిడ్డలకు తులం బంగారం ఇస్తామన్నారు.
ఎవరికైనా ఇచ్చారా? మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4 వేలు పెన్షన్ ఇస్తామని మోసం చేశారు”అని పేర్కొన్నారు. మాగంటి సునీతను గెలిపించుకుంటే మళ్లీ కేసీఆర్ వస్తారని, 500 రోజుల్లో కేసీఆర్‌ను సీఎంని చేసుకుందామని పిలుపునిచ్చారు.
కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకున్నరు..
సీఎం కేసీఆర్ అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారని కేటీఆర్ అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసుకున్నామని, బస్తీ దవాఖానా, 20 వేల లీటర్ల వరకు ఉచిత నీళ్లు, కరెంటు కష్టాలు లేకుండా చేసుకున్నామని చెప్పారు. వెంగళ్‌రావు నగర్‌లో వెయ్యి పడకల దవాఖాన నిర్మించుకున్నామని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో 42 ఫ్లై ఓవర్లు, కొత్త లింక్ రోడ్లు వేశామని, అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ సమప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.
ఎవరైనా మోసం చేస్తే అది వాని తప్పు.. కానీ, మళ్లీ మళ్లీ మోసపోతే తప్పు మనదే అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్‌ను ఓడిస్తే అన్ని హామీలు అమలు చేస్తారని, మళ్లీ కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ఏమీ ఇవ్వకపోయినా ప్రజలు ఓటేస్తున్నారని అనుకొని హామీలను అమలు చేయరని అన్నారు.
